Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. 18 మందిలో 16 మంది నేపాలీ యువతులు!

  • ఉద్యోగాల పేరుతో యువతులకు ఎర
  • ఢిల్లీ నుంచి గల్ఫ్ దేశాలకు తరలింపు
  • టెంపుల్ టౌన్‌లో ఘటన
ఉద్యోగాల పేరుతో యువతులను నమ్మించి తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ముఠా ఆటలను పోలీసులు కట్టించారు. వారి చెర నుంచి 18 మంది యువతులను రక్షించారు. వీరిలో 16 మంది నేపాల్‌కు చెందిన వారు కావడం గమనార్హం. ఢిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో వారణాసి క్రైం బ్రాంచ్, ఢిల్లీ పోలీసులు కలిపి నిర్వహించిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది.

ఇదో అక్రమ రవాణా ముఠా అని, యువతులను గల్ఫ్ దేశాలకు పంపించే ఉద్దేశంతో వారిని ఓ ఇంట్లో బంధించి ఉంచినట్టు పోలీసులు తెలిపారు. ఇంటిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నేపాలీ మహిళలను ఉద్యోగాల పేరుతో తొలుత వారణాసి తీసుకొచ్చేవారని పోలీసులు తెలిపారు. ఈ నెల మొదటి వారంలో ముఠా చెర నుంచి ఇద్దరు నేపాలీ యువతులు తప్పించుకున్నట్టు చెప్పారు.

ఈ రాకెట్ గురించి నేపాలీ పోలీసులకు సమాచారం అందించామని, వారు రాయబార కార్యాలయానికి ఈ విషయాన్ని చేరవేసినట్టు పోలీసులు వివరించారు. వారణాసిలో మొత్తం 12 చోట్ల దాడులు నిర్వహించినట్టు చెప్పారు. నిందితుల్లో ఒకడైన జై సింగ్‌ను విచారించగా యువతులను మధ్యప్రాచ్యానికి పంపాలని నిర్ణయించినట్టు చెప్పాడని తెలిపారు.
International
prostitution racket
Nepal
women
Varanasi

More Telugu News